Skip to main content

GEETA MARCHINA RATHA - గీత మార్చిన రాత

నగరానికి దూరంగా కొండ మీద ఒక అందమయిన ఇల్లు. అత్యంత ఆధునిక సౌకర్యాలు, అధునాతన భద్రతా వ్యవస్థ కలిగిన ఇల్లు అది. పైకి సైనిక స్థావరంలా కట్టుదిట్టంగా కనిపించినా లోపల ఇంటీరియర్ డెకొరేషన్ మాత్రం వేరే లోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగించక మానదు. ఆ ఇంట్లో కొండ అంచున ఉన్న ప్రత్యేకమయిన అద్దాల గది మన ఈశ్వర్ పర్సనల్ వర్క్ స్పేస్ . 

ఇంతకీ ఈశ్వర్ ఎవరో చెప్పలేదు కదూ!!! ఈయనే మన కధలో హీరో. ఊహ తెలియని వయసులో అనుకోని దుర్ఘటన వల్ల రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన ఈశ్వర్, కొందరి సహాయంతో తనకి ఊహ తెలిసేవరకు అనాధాశ్రమంలో ఉన్నాడు. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అన్నట్లు రామకృష్ణ అనే స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈశ్వర్ ని దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించారు.

ప్రతి ఒక్కరికి వృత్తి, ప్రవృత్తి అని రెండు ఉంటాయి ... ఒకటి పూట గడవడానికి, రెండోది మనసు నడవడానికి, మన మాస్టర్ గారికి చిత్రలేఖనం అంటే మిక్కిలి మక్కువ. ఆ మక్కువతో ఆ వయసులో గోవింద్ అనే ఆర్టిస్ట్ దగ్గర పాఠాలు నేర్చుకునేందుకు తనతోపాటు ఈశ్వర్ ని కూడా వెంటతీసుకుపోయేవారు. వయసులో చిన్నవాడయినా చెప్పిన ప్రతీ విషయాన్ని, నేర్పిన ప్రతీ అంశాన్ని ఎంతో శ్రద్ధతో విని దానిని ఆచరణలో పెట్టేవాడు, అంతేకాకుండా దానిని వేరేవిధంగా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో కూడా ప్రయత్నించేవాడు ఈశ్వర్, ఇలా చిత్రలేఖనంలో అనతికాలంలోనే గురువు వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు. కాలం గడిచే కొద్దీ, ప్రసార మాధ్యమాలు పెరిగే కొద్దీ పెరిగిన పని ఒత్తిడిలో గురువు గారు బాగా బిజీ కావడంతో ఆయనకి కుడిభుజంగా మారాడు, తనమీద నమ్మకంతో కొంత పని గురువుగారు శిష్యుడికి కూడా అప్పచెప్పేవారు,అయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన పనితనంతో శబాష్ అనిపించుకున్నాడు. ఇలా 15 సంవత్సరాలు శిష్యరికం అనంతరం ఆయన ప్రోద్బలంతో చిత్రలేఖనాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నాడు ఈశ్వర్. ఉన్న క్లయింట్ లకు మంచి అవుట్ ఫుట్ ఇస్తూ కొత్త అవకాశాలని వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు సాగాడు. అనతికాలంలోనే సమాజంలో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. 

------------------------------****------------------------------
నెలలో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు కొత్త పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తాడు ఈశ్వర్. వృత్తిపరంగా కలిగే ఒత్తిడులు నుండి బయటపడే ఉపశమన మార్గం అది. ఈసారి పర్యటనలో భాగంగా ట్రెక్కింగ్ చేద్దామని దట్టమయిన నల్లమల అటవీప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ దగ్గరలో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయాన్ని సందర్శించి ట్రెక్కింగ్ గురించిన వివరాలు తెలుసుకుని టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు, ఈ ట్రెక్కింగ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో రాత్రి బస. సూచించిన సమయానికి ట్రెక్కింగ్ మొదలయ్యే ప్రదేశానికి చేరుకొని భద్రత కి సంబందించిన సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాడు. సరిగ్గా సాయంత్రం 4.00 గంటలకు ట్రెక్కింగ్ మొదలయ్యింది, 9 మందితో కూడిన బృందంతోపాటు ఒక గైడ్ నడక ప్రారంభించారు, ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ మెల్లగా ముందుకు నడవసాగారు, ఒక గంట నడక తరువాత దట్టమయిన ఆ అడవిలో, ఆ చెట్ల మధ్య తీగలు అల్లుకుపోయిన ఒక పాత బోర్డు కనపడింది. దానిమీద ఎరుపు రంగులో కుడి, ఎడమ బాణపు గుర్తులు, ఆ బాణపు గుర్తులలో సులువు మార్గం, కఠినమయిన మార్గం అనే పదాలు పసుపు రంగులో రాసి ఉన్నాయ్. సవాళ్ళను ఇష్టపడే మన ఈశ్వర్ ఆ కఠినమయిన మార్గం ఏంటో చూద్దాం అని ఆ మార్గంలో ప్రయాణించడం మొదలు పెట్టాడు, మిగతా వారు మాత్రం సులువు మార్గంలో ముందుకు పోయారు. 

రకరకాల పూల మొక్కలు, వివిధ జాతుల వృక్షాలతో నిండి ఉంది ఆ ప్రదేశం. చాలా కాలంగా అటువైపు ఎవరూ వచ్చినట్లు లేదు, దారి అంతా ముళ్లపొదలతో నిండిపోయి ఉంది. షుమారు 35 నుండి 50 సంవత్సరాలు వయసు గల మర్రి, మామిడి, పనస, నీలగిరి, టేకు,గంధపు చెట్లు, గల గల పారే ఏరు మార్గం మధ్యలో కనపడ్డాయి. మధ్యలో ఆ చెట్టు నుండి ఈ చెట్టు మీదకి దూకుతున్న ఉడుతలు, దొరికిన పండుని ఇష్టంగా ఆరగిస్తూ పక్షులు, మెల్లగా ఆ పూల మొక్కల పై రంగురంగుల సీతాకోకచిలుకలు, ఆ మొక్కల నుండి వీచే చల్లని గాలి తీసుకొచ్చే ఆ పూల సుగంధాలు, అప్పుడప్పుడు దూరంగా రామచిలుకల పలుకులు, కోకిలల కిలకిల రాగాలు వినిపించ సాగాయి. సాయంత్రపు వేళ ఆ ప్రకృతి రమణీయత మధురమయిన అనుభూతిని ఇచ్చింది ఈశ్వర్ కి. 

ప్రతీ 100 మీటర్లకు నారింజ రంగు జండా మార్గం పక్కన పాతి ఉంటుంది, ఆ జండాని అనుసరించి ఆ మార్గంలోనే ముందుకువెళ్లాలి అన్న టూర్ గైడ్ సూచన ప్రకారమే ముందుకు సాగాడు ఈశ్వర్. కానీ మధ్యలో కొన్ని చోట్ల దట్టమయిన పొదల మధ్యలో పెద్ద నారింజ రంగు చెట్టు ఆకులని చూసి పొరబడి వేరే సన్నని మార్గంలో ఒక నాలుగు కిలోమీటర్లు అత్యంత తీక్షణమయిన అడవిలోకి వెళ్ళిపోయాడు.

ప్రోగ్రామ్ లో భాగంగా ట్రెక్కర్లు అందరూ అడవి మధ్యలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు కి చేరుకున్నారు, చుట్టూ 70 అడుగుల చెట్లు, ఆ మధ్యలో వృత్తాకారంలో వేసిన టెంట్లు, ఆ టెంట్ల మధ్యలో ఏర్పాటు చేసిన కాంప్ ఫైర్, ఒక పక్కగా పారుతున్న సన్నని కాలువ ఎంతో చక్కగా ఉంది చూడడానికి. టూర్ గైడ్ వచ్చిన వారిని ఒక్కరొక్కరుగా పేరుపేరున పిలుస్తూ తనవద్దనున్న లిస్ట్ తో సరిపోల్చుకుంటున్నాడు, మొత్తం తొమ్మిది మంది ఉండాల్సిన చోట ఎనిమిది మందే ఉన్నారు ఒక వ్యక్తి కనపడడం లేదు, ఆ విషయం తెలిసేసరికి సన్నగా వణుకు మొదలయ్యింది వారిలో, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఆందోళనతో. చివరగా తనని ఎక్కడ చూసింది గైడ్ చెప్పడంతో తను ఎక్కడ దారితప్పాడో షుమారుగా అర్ధం అయ్యింది టూర్ అసిస్టెంట్స్ కి, వెనకకి తను మిస్ అయిన చోటుకి చేరుకోవడం కోసం డ్రాగన్ లైట్స్ తో బయలుదేరారు.

------------------------------****------------------------------
ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకి అయితే వచ్చేసాడు గానీ , కొంత దూరం వెళ్ళాక జండా విషయం గుర్తొచ్చింది, వెళ్లే కొద్దీ గైడ్ చెప్పిన జండా ఏది కనపడకపోవడంతో దారి తప్పానేమో అని అనుమానం మొదలయ్యింది ఈశ్వర్ కి. ఇక్కడ కాకపోతే ఆ ముందు, ఆ ముందు కాకపోతే ఇంకా ముందు జండా ఉంటుందేమో అన్న ఆలోచనతో ముందుముందుకు వెళ్ళిపోయాడు . కొంతసేపటికి ఇక ముందుకు వెళితే లాభం లేదు అని వచ్చిన దారినే వెనకకు నడవడం ఆరంభించాడు. అరణ్యం కావడంతో నగరానికన్నా వేగంగా చీకట్లు కమ్ముకున్నాయి, నగరంలో అయితే విద్యుత్ దీపాల వెలుగులో చీకటి పెద్దగా అనిపించదు కానీ, ఆ అరణ్యం ఎంతో వేగంగా చీకటి దుప్పటి కప్పుకుంది. ఒక పది నిముషాల నడక తరువాత చీకటిలో తనకి ఇక ఏమీ కనపడక ఆగిపోయాడు, దారి పక్కగా ఒక చెట్టు కింద బయటకు కనపడేలాగా రాళ్లు ఒక ఒక బల్లలా చేసుకుని కూర్చున్నాడు. ఏదో అలికిడి అయినప్పుడల్లా ఎవరయినా తనని తీసుకువెళ్ళడానికి వస్తున్నారేమో, ఏదయినా దీపాల వెలుగు కనపడుతుందేమో అని చూడసాగాడు, చీకటిలో అటు ఇటు ఆహారం కోసం పరిగెడుతున్న చిన్న జంతువుల వల్ల అయిన చప్పుడు, అక్కడక్కడ మిణుగురు పురుగుల కాంతి తప్ప ఏమీ కనపడలేదు. తన వెయిస్ట్ బాగ్ లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్, ప్రోటీన్ బార్ ఆరగించి, తన దగ్గరున్న సీసాలో నీరు త్రాగి కొద్దిగా సేదతీరాడు. ఒకవేళ తనకోసం ఎవరూ రాకపోతే రాత్రికి తాను క్షేమంగా ఉండగలిగే చోటు ఏదయినా ఉందేమో అని చుట్టూ చూసాడు, కానీ అలాంటిదేమీ కనపడలేదు. తక్కువ ఎత్తులో ఉన్న ఒక కొబ్బరి చెట్టుకి ఉన్న నాలుగు కొమ్మలు తెంపి నేలమీద పడకలా తయారు చేసుకుని దానిపై విశ్రమించాడు.

బడలిక వలన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది, కానీ ఇప్పుడు తను నిద్రపోతే ఒకవేళ ఎవరయినా తనని తీసుకువెళ్ళడానికి వస్తే వారికి నా ఆచూకీ తెలియదు అని నిద్ర ఆపుకున్నాడు, ఆ పరిస్థితి కి తగ్గట్టు మేఘసందేశం చిత్రంలో "ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై" అంటూ పాట పాడడం మొదలుపెట్టాడు. తాను ఎన్నో రకాల బొమ్మలు రకరకాల మాధ్యమాల కోసం గీసేవాడు, గీసినవన్నీ కాకపోయినా కొన్నిటికి అయినా ప్రాణం వచ్చి తన ముందు తిరుగుతుంటే ఎంత బాగుణ్ణో అన్న ఆలోచన ఎప్పుడూ వస్తూ ఉండేది ఈశ్వర్ కి . ఒక సినిమా కోసం దంపతుల పోర్ట్రైట్ ఒకటి గీయవలసి వచ్చింది, చూడడానికి అది పాత ఫొటోలా ఉండాలి, అందుకనే తన తల్లితండ్రులు ఎలా ఉంటారో ఊహించి గీశాడు ఈశ్వర్, గీయడం పూర్తయ్యి చివరగా చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తున్న ఈశ్వర్ కళ్ళ వెంట కన్నీటి ధార రావడం ఆరోజు తనతోపాటు పనిచేస్తున్న అసిస్టెంట్స్ ఎప్పటికి మర్చిపోరు. 

×-×-×-×-×-×-×-×-×-×-×-×-×

ఈశ్వర్ ఎంత ఆపుకున్నా కూడా కళ్ళు మగత కమ్ముతూ నిద్రలోకి జారుతుండగా అకస్మాత్తుగా తన ముందు నీలి రంగు వెలుతురు ఒకటి కనపడింది. చటుక్కున కళ్ళు తెరిచి చూసాడు, తనని తీసుకువెళ్ళడానికి మనుషులు ఎవరయినా వచ్చారేమో అని, కానీ ఆ వెలుతురులోనుండి స్త్రీ గొంతు సన్నగా, మెల్లగా ఇలా పలికింది "ఈశ్వర్, ఆందోళన చెందకు, ఇంత కారడవిలో అకస్మాత్తుగా ఇలా జరగడం వల్ల నువ్వు భయపడే అవకాశం లేకపోలేదు, భయపడకు, నేను వనదేవతను, నేనొక విషయం చెప్పేందుకు ఇక్కడకు వచ్చాను, నీ కళతో నువ్వు సృష్టికి ప్రతిసృష్టి చేస్తావు, నీ నైపుణ్యం ఏంటో నీ కాన్వాస్ పైన తిరిగి పునఃసృష్టి ఐన నాకు తెలుసు... ఎన్నో సార్లు నువ్వు గీసిన చిత్రాలకి జీవం వస్తే ఎంత బాగుండేదో అని అనుకోవడం నాకు తెలుసు. అందుకే నీకు నేనొక వరం ఇస్తున్నాను. నువ్వు ఏ చిత్రం అయితే పరుల కోసం కాకుండా నీకోసం నువ్వు గీసుకుంటావో అది ప్రాణం పోసుకుంటుంది, అది ఏదయినా సరే... కనుక నువ్వు నీకోసం గీసుకునే చిత్రాల విషయం లో ఆచితూచి వ్యవహరించు, ఈ వరం నీకు గుర్తు ఉండేలా నీకోక ఆకుపచ్చ రాయి పొదిగిన హారాన్ని బహుకరిస్తున్నాను, నువ్వు ఇప్పుడు ఉన్న ఈ చెట్టు గూటిలో ఆ హారం ఉంది, దానిని ధరించు. ఇప్పుడు నువ్వు దారితప్పావు, నేను ఒక్క క్షణంలో నిన్ను నువ్వు చేరవలసిన వారికి దగ్గరలో విడిచిపెడతాను" అని వెలుతురు మాయం అయిపోయింది. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి అక్కడున్న హారాన్ని తీసుకున్నాడు, తీసుకుని వెనక్కి తిరిగేసరికి ఇందాక తను ఉన్న చోటులో లేడు, వేరే చోట ఒక చిన్న కాలిబాటలో ఉన్నాడు. కాంప్ ఫైర్ అతనికి ఒక 100 అడుగుల దూరంలో స్పష్టంగా కనపడుతుంటే ఎంతో ఆనందంతో అటువైపు పరుగు తీసాడు, అక్కడికి వెళ్లి అందరిని కలుసుకుని దారితప్పిన విషయం చెప్పాడు. ఈశ్వర్ క్షేమంగా తిరిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

టూర్ నుండి తిరిగి వచ్చాక ఎప్పటిలాగే పనిలో నిమగ్నమయ్యాడు ఈశ్వర్, వచ్చి రెండు వారాలు కావొస్తుంది, ఆ దేవత చెప్పిన మాటలు పూస గుచ్చినట్లు ఎంతో వివరంగా గుర్తుకు వస్తున్నాయి. ఆ దేవత ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దాం అనే ఆలోచనతో ఎప్పటిలాగే తను క్యాంపుకి వెళుతున్నట్లు క్లయింట్ లకి చెప్పి, ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే తన గదిలో తనకోసం బొమ్మలు గీసుకోవడం మొదలు పెట్టాడు. ముందుగా కాన్వాస్ నిండుగా చిన్నవి, పెద్దవి రకరకాల రంగుల సీతాకోక చిలుకలను గీసి పక్కన పెట్టాడు, ఆ తరువాత అందమయిన పక్షి జాతి బొమ్మలు గీసి పక్కన పెట్టాడు. మామిడి, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష, అరటి ఇలా అన్ని మధురమయిన ఫలాల బొమ్మలు, అన్ని రకాల పూల మొక్కలు ఒక్కో కాన్వాస్ లో గీశాడు. చివరగా రంభ, ఊర్వశి, మేనకలను తలదన్నే విధంగా అందమయిన స్త్రీని లైఫ్ సైజు కాన్వాస్ మీద గీశాడు. వాటిని అన్నిటిని ఒక చోటుకి చేర్చి అవి ప్రాణం సంతరించుకోవడం కోసం ఎదురు చూడసాగాడు. నిముషాలు, గంటలు గడిచినా కూడా అవి ప్రాణం పోసుకోకపోవడంతో బహుశా ఇది కలికాలం కదా, దేవతలు వరం ఇచ్చినా అవి ఫలించకపోవడం కాలం మహత్యం ఏమో అనుకుని దీపాలు ఆర్పేసి నిద్రకు ఉపక్రమించాడు. 

లోయవైపు ఉండే అందాల గాజుగది అది, ఉదయించిన సూర్యుడి నునువెచ్చని వేడి లేతగా తన బుజాలని తాకడంతో మెలకువ వచ్చింది ఈశ్వర్ కి. మబ్బులా మెత్తగా ఉండే తన బెడ్ మీద నుండి దిగడానికి మనసు రావడం లేదు తనకి, ఎలాగు తను బయట ప్రపంచానికి టూర్ లో ఉన్నాడని తెలుసు, ఇంకొంత సేపు రెస్ట్ తీసుకుంటే ఏం పోతుంది అని అనుకుని మరల కునుకు తీసాడు. తన చెంప మీద ఏదో వాలినట్లు అనిపించి టక్కున మెలకువ వచ్చింది, తడిమి చూసేలోపు ఆ కదలికకి ఎగిరిపోయింది సీతాకోకచిలుక, ఆ గదిలో వాతావరణం కూడా మునుపటిలా లేదు. ఒక కమ్మని వాసన, అంటే ఒక పండు పక్వానికి వచ్చినట్టు, ఒక పువ్వు విరబూసి సువాసనలు వెదజల్లుతున్నట్టు, ప్రకృతి రమణీయత అంతా ఆ గదిలో పరుచుకున్నట్లుగా ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడ. గాలి కూడా చొరబడే అవకాశం లేని ఆ గదిలోకి సీతాకోక చిలుక ఎలా వచ్చింది, ఆ పూల, పళ్ళ సువాసనలు ఏంటి అని ఆలోచన వచ్చీరాగానే తన కళ్ళముందు కొన్ని గంటల క్రితం తను వివిధ కాన్వాస్ లపై గీసిన బొమ్మల గుర్తొచ్చాయి, పెరిగిన గుండెవేగం గమనిస్తుంటే ఏదో అద్భుతాన్ని చూడబోతున్నాను అనే విషయం మాత్రం అర్ధం అయ్యింది తనకి ... బెడ్ మీద నుండి లేచి తన కాన్వాస్లను అన్నిటిని పరీక్షగా చూసుకున్నాడు. ఆశ్చర్యంగా ఫ్రేమ్ కి తగిలించి ఉన్న కాన్వాస్ లు అన్నీ ఖాళీ గా ఉన్నాయి. తలదించి కిందకి చూస్తే గది నిండా ఒక అడుగు ఎత్తు గడ్డి, అక్కడక్కడా అందంగా ఎదిగిన పూల మొక్కలు కనపడ్డాయి, ఈశ్వర్ కళ్ళల్లో ఆశ్చర్యం!! అవును, తను గీసిన ఆ కాన్వాస్ లో బొమ్మలు నిజం అయ్యాయి. తాను గీసిన సీతాకోక చిలుకలు గదిలో ఎగురుతున్నాయి, తాను గీసిన పూల మొక్కలు పుష్పించి ఆ పూలు సువాసనను వెదజల్లుతున్నాయి, పావురాలు, రామచిలుకలు, కోకిల ఇలా రకరకాల జాతి పక్షులు ఒక పక్క, కొన్ని పక్షులు ఆ గడ్డి మధ్యలో ఏదో తింటున్నట్లు గుమికూడి ఉంటే ఏంటా అని దగ్గరకి వెళ్లి చూసాడు, అవి తింటున్నది ఇంకేదో కాదు, తాను గీసిన పళ్ళు, ఫలాలు గడ్డిలో విసిరేసినట్లు అక్కడక్కడా పడి ఉంటే అవి వాటిని హాయిగా, ఆనందంగా ఆరగిస్తుంటే ఆశ్చర్యం గా అనిపించింది ఈశ్వర్ కి. అలా కొన్ని గంటల పాటు ఆ గదిలో ఆవిష్కృతమయిన ఆ ప్రకృతిలో చిన్నపిల్లాడై ఆడుకుంటూ, ఆ ఫలాలు భుజిస్తూ, పక్షులతోపాటుగా పలుకుతూ గడపసాగాడు.


ఇన్ని నిజమయ్యాయి, మరి నేను గీసిన ఆ అందాల రాశి కూడ నిజమయి ఉంటుందా అనే ఆత్రుతతో తాను గీసిన లైఫ్ సైజు కాన్వాస్ వైపు చూసాడు, చూస్తే అది కూడ ఖాళీగా ఉంది కానీ తాను కనడపడలేదు. సాధారణంగా "నీకు ఎలాంటి భార్య కావాలి" అని ఒక పెళ్లికాని కుర్రాడిని అడిగితే ఆ కుర్రాడు చెప్పే లక్షణాల జాబితా మించిపోయేలా తనకోసం జీవితభాగస్వామిని ఎంతో ప్రత్యేకంగా గీసుకున్నాడు ఈశ్వర్. అన్ని చోట్లా వెతికాడు కానీ ఆ కాన్వాస్ వెనకాల చూడలేదు తను, ఎందుకంటే తన లెక్క ప్రకారం ఆ కాన్వాస్ వెనకాల పట్టేంత చిన్నగా అయితే ఉండదు ఆమె. 

అలసటతో వెతకడం ఆపి తన గదిలో ఎడమ వైపు మూలగా నిలుచున్నాడు ఈశ్వర్, తనతో సమానంగా కుడివైపు మూల ఒక మనిషి ఆకారం వచ్చి నిలబడడం తనకి స్పష్టంగా తెలుస్తుంది. ఐ మూలగా తనకి ఆ ఆకారం, వేసుకున్న దుస్తుల రంగు స్పష్టంగా తెలుస్తుంది. క్రమంగా ఆ ఆకారం తనవైపు కదలడం మొదలయ్యింది, అడుగు అడుగుకి క్రమక్రమంగా దగ్గరవుతున్న ఆకారం సరిగ్గా తను ఎలా అయితే బొమ్మ గీసాడో అలాగే ఉంది, దగ్గరయ్యే కొద్దీ గజ్జెల సవ్వడితో పెరగడంతోపాటు ఈశ్వర్ గుండె వేగం పెరిగిపోతుంది.

ఈశ్వర్ కి రెండు అడుగుల దూరంలో ఆగింది ఆ ఆకారం. వెంటనే తల వంచుకుని కుడివైపుకు తిరిగాడు ఈశ్వర్, మొదట కాళ్ళ దగ్గరనుండి మొదలుపెట్టి క్రమక్రమంగా తన తలని పైకి ఎత్తాడు. ఆకుపచ్చ రంగు అంచుతో, బంగారు రంగు బోర్డర్ తో ఎర్రటి పట్టు చీర, కొద్దిగా పైకి వస్తే నడుముకి వడ్డాణం, ఇంకొద్దిగా పైకి వచ్చేసరికి మెడ నిండా పచ్చల పతకాలు, బంగారు ఆభరణాలు, ఆకుపచ్చ రంగు జాకెట్, భుజానికి వంకీలతో ధగధగ లాడే మేని ఛాయతో ఆమె ఎంతో సౌందర్యంగా ఉంది. చివరగా ముఖంలోకి చూసాడు, ఇద్దరి కళ్లుకళ్లు కలిసాయి, ఈశ్వర్ మాత్రం రెప్ప వేయకుండా తననే చూస్తున్నాడు, ఎందుకంటే రెప్పవాలి తెరిచేలోపు తను వెళిపోతుంది అనే భయంతో. కొన్ని క్షణాల పాటు ప్రపంచంలో వాళ్లిద్దరే అన్నట్లుగా కాలం ఆగిపోయినట్లుగా మారిపోయింది. ఈశ్వర్ ఏదో మాట్లాడబోయినట్లు నోరు విప్పే ప్రయత్నం చేసాడు. 

ఇంతలో .........................................................
"ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు" అని తన భుజాన్ని బలంగా తడుతున్న ట్రెక్కింగ్ అసిస్టెంట్ గొంతు విని నిద్రలోనుండి మేలుకున్నాడు ఈశ్వర్, అయోమయం గా అటుఇటు చూసాడు, అంతవరకు ఏం జరిగింది అనేది కొన్ని క్షణాలపాటు అంతా ఒక షో రీల్ లా తన కళ్ళముందు కదిలింది, అయ్యో ఇంతసేపు నేను చూసింది కలా?? అని ఆశ్చర్యానికి లోనయ్యాడు, ఇది నిజం అయితే ఎంత బాగుండేది అని తనలోతానే నవ్వుకున్నాడు, ఈ కల గురించి ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాడు, ఎందుకంటే కలని కలలా అర్ధం చేసుకునేంత విచక్షణ అందరు మనుషులకి ఉండదేమో అన్న ఆలోచనతో . ఆ చీకటిలో టూర్ అసిస్టెంట్స్ సహాయంతో గంటన్నర నడక తరువాత క్యాంప్ కి చేరుకున్నాడు,అప్పటికి రాత్రి 1.00 కావొస్తుంది . కొద్ది సమయం మిగతవారితో గడిపి నిద్రకు ఉపక్రమించాడు. మరునాడు ఉదయం యధావిధిగా లేచి తయారయ్యి అల్పాహారం చేసిన తరువాత తిరిగి వారి నడక మొదలయ్యింది. మధ్యాహ్నం షుమారు 12.00 గంటలకి వారు చేరాల్సిన ఫినిష్ లైన్ చేరుకున్నారు. అందరూ ఒకరి వివరాలు ఒకరు తీసుకోని ఆనందంగా అక్కడనుండి ఎవరికీ వారు వెనుదిరిగారు.

టూర్ లో జరిగిన సంఘటన తన మనసులో ఒక రకమయిన భావోద్వేగాన్ని రేకెత్తించింది. ఆ ఆలోచనలతోనే, కొద్దిగా పరధ్యానంగానే ఇంటికి వచ్చిన ఈశ్వర్ లగేజ్ అంతా పక్కన పడేసి మంచం మీద వాలిపోయాడు, ఒక పది నిముషాలు విశ్రాంతి అనంతరం స్నానం చేయడం కోసం గదిలో బాత్ టబ్ లో వేడినీటిని వదిలాడు, ఆ నీటి సెగతో ఆ బాత్ రూమ్ అంతా ఆవిరి పట్టింది. అద్దం కూడా మబ్బు కమ్మినట్లు అవ్వడంతో తన చేతితో తుడిసి అలా పక్కకి తిరిగాడు, తిరిగినంత వేగంగా వెనకకి వచ్చి చూసుకున్నాడు ... ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగంతో కూడిన కన్నీళ్లతో కళ్ళు చెమ్మగిల్లాయి, ఎందుకంటే ఏ కలలో అయితే ఆకుపచ్చ రాయి తొడగబడిన హారాన్ని చూశాడో అదే హారం ఇప్పుడు తన మెడలో ఉంది. అడవి నుండి తిరిగి వచ్చేసాడు గానీ తన మనసులో ఏదో తెలియని లోటు ఉండిపోయింది, ఇది చూడగానే తన మనసులో ఆ లోటు తీరిపోయి గుండె బరువు దిగిన భావన.

ఆ హారంలో పచ్చ ఒక్క క్షణం మిణుకుమని ఒక చిన్న కాంతి విసిరింది నేనున్నాను అన్నట్లు. 


*********** సశేషం *********** 

చాలా సార్లు ప్రఖ్యాత చిత్రకారులులు వేసిన అందమయిన వర్ణపఠాలు చూసినపుడు ఇంపయిన రంగులతో, సొంపయిన వంపులతో నిండి ఉంటాయి. అవి గనక నిజమయితే ఎలా ఉంటుందో అన్న ఆలోచన నుండి పుట్టిన కధ ఇది, చదివి మీ విలువయిన ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరు.


మీ,
సుద్దపల్లి వెంకట సాయి కిరణ్

Comments