Skip to main content

USHA LENI KIRANAM - ఉష లేని కిరణం

కిరణ్, ఒక మామూలు మధ్యతరగతి కుర్రాడు ... కష్టించి పని చేసే మనస్తత్వం గలవాడు, నిఘర్వి. అందరిలాగే తనకి కూడ జీవితం మీద ఆశలు , చేరుకోవాల్సిన లక్ష్యాలు, నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయ్. సగటు మనిషిలాగే రేపటి మీద ఆశతో, ఆ ఆశని చేరుకోడానికి ఇవాళ నుండే ఏం చేయాలి అనే స్పష్టత ఉన్న కుర్రాడు.

ఉష, శాస్త్రి గారి అమ్మాయి ... మన కిరణ్ ప్రేమించిన పిల్ల ... ఎంతో చలాకీ, చదువుల్లో మేటి, ఆచారవ్యవహారాలన్నా, పెద్దలన్నా గౌరవం ... ప్రతీ ఇంటా సాధారణంగా తండ్రి దగ్గర కన్నా తల్లి దగ్గరే పిల్లలకి చనువు ఎక్కువ, ఉషకి అమ్మ దగ్గర తాను ఆడిందే ఆట, పాడిందే పాట.... కానీ తండ్రి వచ్చే సమయానికి మాత్రం ముక్కున వేలు వేసుకుని కూర్చుంటుంది. అంత భయం, గౌరవం తండ్రి అంటే. ఎంత పెరిగి పెద్దవాళ్లయినా కూడా తల్లితండ్రుల మనసులలో పిల్లలు ఎప్పుడూ చిన్న పిల్లలే.

ఉషాకిరణ్ లకు ఒకరంటే ఒకరికి అమితమయిన ప్రేమ, ఇద్దరూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారంటే తనువులు రెండే కానీ మనసు ఒకటే అన్నట్లుగా. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో మీరు తెలుసుకోవాలి! ఒకసారి కళాశాల తరపున తుఫాన్ బాధితుల సహాయనిధి కోసం డబ్బులు, వస్తువులు సేకరించే పనిలో కిరణ్ వాళ్ళ ఇంటి తలుపు తట్టింది ఉష, మనోడి గుండె తలుపు కూడా. మొదటి సారి ముఖ పరిచయం, ఆ తరువాత మాట పరిచయం జరిగింది. తరచుగా కళాశాల ఆవరణలో కలుస్తూ ఉండడంతో ఒకరి అభిరుచులు ఒకరికి తెలిసాయి. ఇష్టం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. వారి ప్రేమ వయసు 4 వసంతాలు. 
---------------------------***---------------------------
కొన్ని పనుల మీద పట్టణం వెళ్ళాడు కిరణ్. అన్నిటిని ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకుని సాయంత్రం రైలు బండికి తిరుగు ప్రయాణం అయ్యాడు, వస్తూ వస్తూ తన ప్రియసఖి ఉష కోసం బహుమతి కూడా కొన్నాడు. రైలు బండి ఎక్కి కూర్చున్న తనకి ఎదురు సీట్ ఖాళీ గా ఉండడం గమనించాడు, పక్క సీట్ ఎప్పుడు నిండుతుందో తెలుసుకునే ఉద్దేశంతో TC ని అడిగాడు. TC పక్క స్టేషన్లో జాయినింగ్ ఉంది అని చెప్పాడు. పుస్తకాలు చదవడం బాగా అలవాటు ఉన్న కిరణ్ బండి బయలుదేరగానే దానిలో లీనం అయిపోయాడు, కొంతసేపటికి పక్క స్టేషన్ లో రైలు ఆగడం, ఎవరెవరో రైలు ఎక్కిదిగడం చూచాయగా తెలుస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. ఎదురుగా ఒక మనిషి వచ్చి కూర్చున్న విషయం తనకి లీలగా తెలుస్తున్నా తల ఎత్తకుండా అలాగే పఠనం కొనసాగిస్తున్నాడు. ఒరేయ్, తల ఎత్తరా మెడ కండరాలు పట్టేస్తాయి అని అవతలి వ్యక్తి అనగా తల ఎత్తాడు కిరణ్. తన ప్రాణస్నేహితుడు కళ్యాణ్ తన ఎదురుగా ఉండడం చూసి తనకి ఎంతో ఆశ్చర్యం కలిగించించింది, అలాగే కళ్యాణ్ కి కూడా. ఎన్నో సంవత్సరాలు అయింది ఇద్దరూ కలిసి. చదువుకున్నది ఒకే బడిలో, పెరిగింది ఒకే ఊరిలోనే అయినా కళ్యాణ్ కళాశాల అనంతరం ఉద్యోగరీత్యా వేరు వేరు ఊర్లు తిరుగుతూ ఉండడం వల్ల తరువాత పెద్దగా ఇద్దరూ కలిసింది లేదు. ఎంతోకాలం తరువాత కలిసిన స్నేహితులు ఇద్దరూ కూడా మాటల్లో మునిగితేలిపోయారు, చివరగా పెళ్లి ప్రస్తావన వచ్చింది ఇద్దరి మధ్య. ముందుగా కళ్యాణ్ చొరవ తీసుకుని తన మరదలితో వివాహం గురించి చెప్పుకొచ్చాడు, ఇప్పుడు తను ఊరు వెళ్తున్నది కూడా అందుకోసమే అని అన్నాడు. నాకు ఇప్పుడే వివాహం చేసుకునే ఉద్దేశం లేదు, దానికి ఇంకా సమయం ఉంది కిరణ్ చెప్పడంతో, తనకి కాబోయే జీవితభాగస్వామి చిత్రాలు స్నేహితునికి చూపించాలి అన్న తపనతో తన చరవాణి లో వారిద్దరి నిశ్చితార్ధపు చిత్రాలను చూపించాడు కళ్యాణ్. కిరణ్ ఆ చిత్రాలని అలా చూస్తూ ఉండిపోయాడు ఆశ్చర్యంగా. తన కాబోయే జీవితభాగస్వామి అందగత్తె అనే చిన్న గర్వం కళ్యాణ్ మనసులో లేకపోలేదు, అందుకేనేమో అనుకున్నాడు

ఇరువురి సంభాషణ

కళ్యాణ్ : ఏంట్రా, అంత ఆశ్చర్యపోతున్నావ్? చూసి చూడగానే ఈ అమ్మాయితో ప్రేమలో పడిపోయావా ఏంటి ?? (అని అడిగాడు వెటకారంగా)

కిరణ్ : పడ్డాను అని చెపితే నిశ్చితార్ధం రద్దు చేసుకుంటావా ఏంటి? (కొద్దిగా గంభీరమయిన గొంతుతో, వెంటనే చిన్నగా నవ్వుతూ)

కళ్యాణ్ : అబ్బా ఆశ !!! వచ్చే జన్మలో ప్రయత్నించుకో, ఈ జన్మకి తానే నా అర్ధాంగి (నవ్వుతూ చేతిలోనుండి చరవాణిని తీసుకున్నాడు)

కిరణ్ : ఇలా అన్నాను అని పెళ్ళికి పిలవడం మానేయవు కదా ???

కళ్యాణ్ : ఆపు గురూ వేళాకోళం, నిన్ను పిలవకుండానా ... ఇదిగో నా పెళ్లి శుభలేఖ, నువ్వు తప్పకుండా రావాలి (అని పేరు రాసి చేతిలో పెట్టాడు)

కిరణ్ : ప్రాణస్నేహితుడి వివాహానికి రాకుండా ఎలా ఉంటాను కళ్యాణ్ , రెండు మూడు రోజుల ముందే ఉంటాను(అని కార్డు తీసుకున్నాడు)

** ఇలా వారు మాటల్లో మునిగిపోయారు. రైలు గమ్యం చేరుకుంది, ఇద్దరూ రైలు దిగి ఎవరిదారి వారు పట్టారు **
-----------------------------
ఊరికి అతి దగ్గరలో ఉన్న చిన్న కొండపైన ఉన్న రాములవారి గుడిలో కలుసుకోవడం ఉషాకిరణ్ లకి అలవాటు. ఒక్క గుడి పంతులుగారికి, ఆ సీతారామయ్య లకి మాత్రమే వీరి ప్రేమ సంగతి తెలుసు. కొండపైన ఉండే గుడి కావటంతో ఏ సమయంలో గుడి రద్దీగా ఉంటుందో ఒక అంచనా ఉంది ఇద్దరికీ. రాములవారి సేవ చేయటం ఉష కి అలవాటు, సేవ అనంతరం కిరణ్ తో కొంత సమయం గడిపేది. కిరణ్ ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత రాముల వారి గుడిలో ఎప్పటిలాగే కలిశారు ఇద్దరూ. ఎప్పుడూ లేనిది ఆ రోజు ఉష ఎందుకో ముభావంగా ఉండడం గమనించాడు కిరణ్. తన పరిచయం తరువాత ఉషని అలా చూడడం అదే మొదటిసారి. కారణం ఏంటో తెలుసుకుందాం అని తనని మాట్లాడించే ప్రయత్నం చేసాడు, తన తెచ్చిన బహుమతితో తనని ఆనందింపచేద్దామని బహుమతి తీసి ఇచ్చాడు. కిరణ్ పిలువుతో ఏదో ఆలోచన లో ఉన్న ఉష తేరుకుని బహుమతి తీసుకుంది ... తెరిచి చూస్తే తనకి ఎంతో ఇష్టమయిన కాలి గజ్జెలు. కిరణ్ వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. తను నవ్వగానే కొండంత హుషారు వచ్చింది కిరణ్ కి. ఒక కాలికి మాత్రమే గజ్జె కట్టుకుంది, రెండోది కిరణ్ కాలికి కట్టింది. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ఒకరి తరువాత ఒకరు వారి కాలు కదుపుతూ గజ్జెల సవ్వడి చేయడం మొదలు పెట్టారు. ఇంతలో ఉష మాట్లాడేందుకు గొంతు విప్పింది.


ఆ తరువాత వారిద్దరి మధ్య సంభాషణ :

ఉష : బహుశా ఇది చివరిసారి కావచ్చు కిరణ్ మనం కలవడం ?? ( ఇద్దరి కాళ్ళూ ఒకేసారి కదలడం ఆగి నిశ్శబ్దం ఆవరించింది అక్కడ)

కిరణ్ : అవును నిజమే ఉషా! ఈరోజు 31వ తారీఖు, నెల చివరి రోజు ... ఈ నెలకి ఇదే చివరిసారి కలవడం (కొన్ని క్షణాల తరువాత, నవ్వుతూ)

ఉష : వేళాకోళం కాదు కిరణ్, ఇది నిజం. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వారి మాటలబట్టి నన్ను బయటి వారికి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశ్యం లేదు అనేది స్పష్టం అయ్యింది.

కిరణ్ : బయటివారికి అంటే??

ఉష : మా కులం కానివారికి, మాతో బంధుత్వం కలవలేని వారికి అని.

కిరణ్ : కలుపుకుంటే అందరూ బంధువులే ఉష, రక్తం రంగే చెబుతుంది అందరిది ఒకటే కులం, మానవ కులం అని

ఉష : మాట్లాడినంత సులువు కాదు కిరణ్ ఆచారవ్యవహారాలకి ఎదురువెళ్ళి గెలవడం.

కిరణ్ : మన పుట్టుకే ఒక గెలుపుతో మొదలయ్యింది ఉష, మధ్యలో మనం పెట్టుకున్నవి ఈ ఆచారవ్యవహారాలు

ఉష : నువ్వు ఎన్నయినా చెప్పు కిరణ్, మా నాన్నగారి మాటకి గానీ, మా ఆచారవ్యవహారాలకు గానీ ఎదురెళ్ళే ధైర్యం నాకు లేదు

కిరణ్ : నిజం చెప్పు ఉష, నువ్వు నాతో వెటకారం ఆడటం లేదు కదా !!!!

ఉష : నా ప్రాణం నువ్వు, నీతో వెటకారం ఆడితే నాతో నేను ఆడినట్లే

కిరణ్ : మరి అలాంటపుడు నేను లేకుండా ఎలా బ్రతుకుతావు

ఉష : నా ప్రశ్న కూడా ఇదే కిరణ్, నేను లేకుండా ఎలా బ్రతుకుతావో అని

కిరణ్ : పిచ్చి దానిలా మాట్లాడకు ఉషా

ఉష : అవును పిచ్చే .... నువ్వంటే పిచ్చి, నీ మాటంటే పిచ్చి, నీ ప్రేమంటే పిచ్చి ... నిజంగానే నాకు పిచ్చి, పిచ్చి, పిచ్చి

******* కొన్ని క్షణాల పాటు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అలా నిశ్శబ్దంగా గడిపారు, కానీ వారి మెదళ్లలో చిన్నపాటి తుఫానులాగే పరిగెడుతున్నాయి ఆలోచనలు *******

కిరణ్ : మనం విడిపోక తప్పదా, ఈ కాలంలో కూడా కులాలు చూస్తారా ఉషా ??

ఉష : తప్పదు కిరణ్, ప్రాణాలు అయినా వదిలేస్తారు కానీ ఆచారవ్యవాహారాలు వదలని మనుషులు ఇప్పటికీ సమాజంలో ఉన్నారు, నా కుటుంబంలో కూడా

కిరణ్ : మరి ఇది తెలిసినదానివి .. మన పరిచయాన్ని స్నేహం దగ్గరే ఆపొచ్చుగా, ఇంతదూరం వచ్చాక చెబితే ఎలా ??? (రొప్పుతూ). నేను మనిషినే ఉషా, మరమనిషిని కాదు ఆదేశం ఇవ్వగానే గతం చెరిపేసి భవిష్యత్తులోకి వెళ్ళడానికి.

ఉష : నేను కూడా మర మనిషిని కాదు కిరణ్, నీ మనిషిని

కిరణ్ : నా మనిషివి అంటున్నావ్, నీ మాటలతో నాకు గాయాలు చేసి, ఆ గాయాలతో మిగిలిన బ్రతుకు బ్రతకమంటే ఎలా ఉషా ??

ఉష : నీకు గాయాలు చేస్తే నాకు నేను చేసుకున్నట్లు కాదా కిరణ్ ?? ఇలాంటి పరిస్థితిలో ఉండడం నాకు మాత్రం ఇష్టమా ?? ఎంత పెద్ద సమస్య ఎదురుగా లేకపోతే నేను ఈ మాట మాట్లాడతాను ?? (ఎప్పుడూ చూడని కోపాన్ని ఉష మాటలలో, చేతలలో చూసాడు. తప్పక విడిపోవాలి అనే బాధ, ఆవేదన తన కళ్ళల్లో చూసాడు కిరణ్)

-------------------------------------------------------

కధలో కొద్ది రోజులు వెనకకి వెళితే రైలులో కళ్యాణ్ తన జీవితభాగస్వామి చిత్రాలు చరవాణిలో చూపించినపుడు కిరణ్ అంత ఆశ్చర్యానికి గురికావడం వెనుక కారణం ఆ చిత్రాలలో ఉన్నది మరెవరో కాదు "ఉష" మరియు కళ్యాణ్. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటేనే ప్రియుడికి ఈ విషయం చేరవేసి తొందరచేసే అమ్మాయిలు ఉన్న ఈరోజుల్లో నిశ్చితార్ధం అయినా కూడా ఉష ఈ విషయాన్ని తన దగ్గర చెప్పకపోవడాన్ని కిరణ్ తప్పుగా అయితే తీసుకోలేదు. అందుకే ఇద్దరూ రాములవారి గుడిలో కలిసే రోజుకోసం ఎదురు చూసాడు, అప్పటికే తను మానసికంగా ఎటువంటి పరిస్థితులకయినా సిద్ధంగా ఉన్నాడు !!! తను ఏం చెబుతుంది అనే ఇంతవరకూ వేచిచూసాడు, తనవైపు ఎంత కఠినమయిన పరిస్థితులు లేకపోతే ఇద్దరూ విడిపోతేనే బాగుంటుంది అన్న ఆలోచనకి ఉష వచ్చిందో అని తనవైపు కోణంనుండి కూడా ఆలోచించాడు. వీరిద్దరూ కలిసి నడిస్తే తరువాత జరిగే పరిణామాలు ఊహించాడు, విడిపోతే ఆ బాధ అనుభవించేది ఇద్దరే... కానీ వీరిద్దరూ కలిసి ఉండడానికి నిర్ణయం తీసుకుంటే మాత్రం రెండు కుటుంబాలు, రెండు కులాలు, రెండు ప్రాంతాల మధ్య ఏర్పడే అసమానతలు అగాథంలా మారతాయి. చేసేది ఏది లేక విడివిడిగా ఉండడానికే నిర్ణయం తీసుకున్నాడు, అందుకే ఉషని తన మాటలతో ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఆగిపోయాడు. కళ్యాణ్ కుటుంబం గురించి కూడ కిరణ్ కి తెలుసు, మంచి ఇంటికే కోడలిగా వెళ్లడం ఉష చేసుకున్న అదృష్టం గా అనుకుని మౌనం గా నిట్టూర్చాడు.

-------------------------------------------------------

కిరణ్ : ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్ ఉష చెప్పు ??? (ఈ మాట అడిగి వెనక్కి తిరిగి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు)

ఉష : విడిపోవడం, ఈలోకాన్ని వీడిపోవడం తప్ప వేరే మార్గం నాకు కనపడటం లేదు కిరణ్ ? (తల దించుకుని మాట్లాడుతుంది ఉష )

కిరణ్ : ప్రేమికులుగా చనిపోయి లోకం నుండి విడిపోవడం కన్నా, లోకం కోసం విడిపోయి ప్రేమని బ్రతికిద్దాం ఉష (అన్నాడు, దుఃఖం నిండిన గొంతుతో)

ఉష : అయ్యో ఏడుస్తున్నావా కిరణ్ !!! (అంటూ తనని ఓదార్చడానికి అడుగులు ముందుకు వేస్తున్న ఉషని అక్కడే ఆగమన్నాడు కిరణ్ )

కిరణ్ : ఊపిరి ఉన్నంతకాలం నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను ఉషా, వెళ్లిరా !!! (అని తన గొంతు ధ్వనించడంతో దుఃఖంతో నిండిపోయింది ఉష )

-------------------------------------------------------
ఒక్క కాలికే కట్టిన గజ్జె చప్పుడు క్రమక్రమంగా తగ్గడం వింటున్న కిరణ్ కొంతసేపటికి ఆ అలికిడి కూడ వినపడకపోవడంతో తను వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాడు. జంటగా అడుగు వేయవలసిన ఆ గజ్జెలు అలా ఒంటిగా మిగిలిపోవడానికి కారణమయిన ఈ సమాజపు కట్టుబాట్ల మీద అసహనం పెల్లుబికింది కిరణ్ మనసులో .... చీకటి పడుతుండడంతో దుఃఖాన్ని అణుచుకుని మెల్లగా అక్కడనుండి నిష్క్రమించాడు.

రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. క్యాలెండర్లో నుండి రోజుకో పేజీ చింపి పెళ్లికి రోజులు దగ్గరపడుతున్నాయి అని బంధువుల ఆనందిస్తుంటే చూసి చిరునవ్వు చిందించడం తప్ప తాను చేయగలిగింది ఏముంది అని లోలోపల కుమిలిపోయింది ఉష.

శాస్త్రి గారి ఇల్లు, ఇంటి ఆవరణ పెళ్లి సందడితో ముస్తాబు అయ్యింది. రాత్రి ముహూర్తం కావడంతో దీపాల అలంకరణలో ఇల్లు మరింత శోభాయమానంగా వెలిగిపోతోంది... పి పి పి డుం డుం డుం అని మేళాల వారు వాయిద్యాలని శృతి చేసుకుంటున్నారు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న కిరణ్ వివాహ ముహూర్త సమయం దగ్గర పడింది అని భావించి తన కాలికి ఒంటి గజ్జె కట్టుకుని రాముల వారి గుడి ఉన్న కొండకి బయలుదేరాడు. కొంత సేపటికి ఎక్కడయితే తన ప్రియసఖిని తరచుగా కలిసేవాడో ఆ ప్రదేశంలో ఇప్పుడు ఒంటరిగా నిలిచి ఉన్నాడు. కళ్ళు దుఃఖంతో మసక కమ్ముతున్నాయి. ఇక ఎంతోసేపు సమయం లేని తన ప్రేమ చివరి క్షణాలని ఆస్వాదిస్తున్నాడు. ఉన్నట్టుండి గట్టిగా మేళతాళాలు శబ్దాలు, బాణాసంచా వెలుగులతో నిండిపోయింది శాస్త్రి గారి ఇల్లు ... తన ప్రేమ గడిచిన క్షణంతోపాటు గతంలో కలిసిపోయింది అని చెప్పడానికి సంకేతంగా.

every end is a new begining అన్నారో మహాకవి, అది నిజమే అనిపించింది కిరణ్ కి.

---- మొదటి భాగం ముగిసింది ----

మీ,
సుద్దపల్లి వెంకట సాయి కిరణ్

Comments