Skip to main content

SANDHYA KIRANAM - సంధ్యాకిరణం

ఇది "ఉష లేని కిరణం కధ - రెండవ భాగం", ముందుగా మొదటి భాగం చదివిన తరువాత ఈ రెండవ భాగం చదవమని పాఠకులకి మనవి.

ఉషలేని కిరణం   పై క్లిక్ చేసి మొదటి భాగాన్ని చేరుకోండి 
.............................
దూరంగా వెలుగుతున్న బాణసంచా వెలుగులు, పెద్దగా మొగుతున్న బాజాబజంత్రీల మోతకి ముహూర్త సమయం దాటిపోయింది, ఉష మరొకరి అర్ధాంగి అయ్యింది అని కిరణ్ కి అర్ధం అయ్యింది. ఎంత ఆపుకున్నా దుఃఖం తన్నుకొస్తోంది, తెరలు తెరలుగా ఉష జ్ఞాపకాల అలలు తన మనసుని తాకుతుంటే తట్టుకోవడం తనవల్ల కాలేదు, వెక్కివెక్కి ఏడుస్తూ, తనలోతానే మాట్లాడుకుంటూ, తనకి తానే సర్దిచెప్పుకుంటూ ఎప్పుడు జారుకున్నాడో తెలియదు కానీ నిద్రలోకి జారుకున్నాడు, కలలో కూడా వీడకుండా ఉష తలపులే. గతంలో శ్రీరామనవమి సందర్భంగా ఉష రాములవారి గుడి సేవలో ఉండగా కిరణ్ గుడిలోనే ఒక పక్కగా నిద్రలోకి జారుకున్నాడు, అప్పుడు ఉష వచ్చి ముఖం మీద నీళ్లు చిలకరించడంతో నిద్రలోనుండి మేలుకున్నాడు, ఈ క్షణం కూడా ముఖం మీద నీటి చుక్కలు చిలకరించినట్లు పడుతుండడంతో తనేనేమో అని ఆశగా కళ్ళు తెరిచాడు, లేచి కూర్చుని అటు ఇటు చూసాడు. తల పైకెత్తేసరికి బుగ్గ మీద పడ్డ వాన చినుకు కన్నీటితో పాటు జాలిగా కిందకి జారింది. మేఘం వర్షించేముందు పడే చిరు చిరు చినుకులవి. తలదించుకుని నిరాశగా నిట్టూర్చాడు.

చినుకు చినుకు పెరిగి పెద్దదై కుండపోతగా వర్షం పడసాగింది, పగలు రాత్రి తేడా తెలియనంతగా ఆకాశం మెరుస్తోంది, అకస్మాత్తుగా గాలిని చీల్చుతున్నట్టుగా పెళపెళమంటూ పిడుగు పడ్డ శబ్దం, తన వెనుకగా చాలా దగ్గరలో పడింది అది. కిరణ్ దానికి భయపడలేదు, తన జీవితంలో పడ్డ పిడుగుల కన్నా పెద్దది ఏమీ కాదు అని అనిపించింది తనకి. ఇదే కొండ మీద రాములవారి గుడిలో ఉండగా జోరుగా వాన పడుతున్నపుడు దగ్గరలో పిడుగు పడితే భయపడ్డ ఉష తన చేయి పట్టుకుని "అర్జున, ఫాల్గుణా, కిరీటి" అని పలుమార్లు పలకడం తనకి గుర్తొచ్చింది.

విపరీతంగా వీస్తున్న గాలికి ఎండిన చెట్టు ఆకులు తెగి పడుతుండగా రేగిన దుమ్ము రేణువులు కిరణ్ కంట్లో పడి విపరీతంగా మండసాగింది, ఒకసారి ఉష కళ్ళలో దుమ్ము పడితే కళ్ళలో ఊది నలకని తీసిన విషయం గుర్తుకువచ్చి కుమిలికుమిలి ఏడవడం మొదలుపెట్టాడు.
ఇలా ఆ కొండమీద ఆ సీతారాములవారి గుడిలో తనకి, ఉషకి మధ్య ఎన్ని జ్ఞాపకాలో.

ఆ సమయంలో అకస్మాత్తుగా భుజం మీద ఒక చెయ్యి పడడంతో ఒక్కసారిగా ఆందోళన చెంది వెనక్కి తిరిగాడు కిరణ్, చూస్తే గుడి పంతులు గారు. గొడుగులో తనవద్దకి వచ్చి "ఇంటికెళదాం రా" అని గద్దించినట్లు పిలవడంతో మారు మాట్లాడకుండా పంతులు గారి వెనక వెళ్ళాడు. ఆ కొండమీదనే గుడికి పక్కగా ఆయన నివాసం. రోజూ కొండ ఎక్కిదిగడం కష్టం కనుక గ్రామపెద్దలు పంతులుగారికి అక్కడే ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆయనకి ఏం కావాలన్నా గుడికి వచ్చిన వారిచేత కబురుపెట్టి రప్పించుకొనే వారు.

ఊరిలో ఏ శుభకార్యం అయినా మన పంతులుగారికి పిలుపు రావలసిందే, అయన హస్తవాసి చాలా మంచిదని నమ్మిక. ఊరిలో ఉష,కళ్యాణ్ ల వివాహం జరిపించి శుభ్రంగా విందుభోజనం చేసి మెల్లగా కొండ మీద ఉన్న తన ఇంటికి చేరుకునేసరికి కొద్దిగా ఆలస్యం అయ్యింది పంతులుగారికి. ఆయన అనుకున్నట్లుగానే కిరణ్ ఆ కొండ మీదనే ఉన్నాడు. మొదటినుండి ఉష కిరణ్ ల ప్రేమకి సాక్ష్యం ఆయనే, ఇప్పుడు ఉష లేని కిరణ్ పడుతున్న వేదనికి సాక్ష్యం కూడా ఆయనే...

నాలుగు అడుగులు వేయగానే పంతులు గారి ఇల్లు వచ్చేసింది, లోపలకి వెళ్ళాక తల తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చి పక్క సర్దుతూ "ఏం చేయగలం నాయనా, కాలంతో పాటు ముందుకు పోవడమే, వెనక్కి చూసుకుంటే గుండె బరువెక్కడమే గానీ ఉపయోగం ఏమయినా ఉందంటావా చెప్పు, మానవమాత్రులం మనం మాత్రం ఏం చేయగలం!!" అన్న ఆయన మాటకు కిరణ్ బాధగా ఆయన వైపు చూసాడు. "పెళ్లి బాగా జరిగింది నాయనా, ఆమె అక్కడ బానే ఉంటుందిలే, ఇంద ఈ రగ్గు కప్పుకుని శుభ్రంగా నిద్రపో" అని వెలుగుతున్న దీపాన్ని ఆపి ఆయన కూడా నిద్రకు ఉపక్రమించారు.

ఉదయాన్నే గుడిలో గంట కొట్టిన శబ్దానికి మెలకువ వచ్చింది కిరణ్ కి... పంతులు గారు మొదటిపూజ చేసి హారతి ఇస్తూ కొట్టిన గంట అది. దూరం నుండి పంతులు గారికి తను వెళుతున్నట్లు సైగ చేసాడు కిరణ్. మెల్లగా దగ్గరకి వచ్చి "నాయనా, గుడికి వస్తూ ఉండు. నీ పేరుకు తగ్గట్టే మీ ఇంటి కిరణానివి నువ్వు, ఏం చేసినా అది గుర్తుపెట్టుకొని చెయ్యి, మధ్యలో వచ్చి మధ్యలోనే పోయిన వాటి గురించి అంతగా చింతించకు, జై శ్రీరాం" అని దీవించి పంపారాయన.

మనకి ఎంతో ఇష్టమయిన వాళ్ళు దూరం అయితే కలిగే వైరాగ్య భావం మనసంతా అలుముకుంది. ఇంచుమించుగా ఇలాంటి వైరాగ్య భావనే తన తండ్రి మరణించినవుడు కలిగింది కిరణ్ కి... తండ్రి ఈలోకం నుండే శాశ్వతంగా దూరం అయ్యాడు, ఇక్కడ ఉష తన ప్రేమలోకం నుండి శాశ్వతం గా దూరం అయ్యింది. జీవితం మొదట ఏడుపుతో మొదలు అయ్యి చివరగా ఏడుపుతోనే ముగుస్తుంది, మధ్యలోవన్నీ ఆశాస్వతం అన్న భావన మనసులో నిండిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా మెట్లు దిగి ఊరిలోకి అడుగు పెట్టేసరికి ప్రతి ఇంటి బయట ఆడవారు కళ్ళాపు జల్లి ముగ్గులు వేస్తూ కనిపించారు. నిన్నటి ముగ్గుని తుడిచి నేటికోసం కొత్తగా ముగ్గు వేస్తూ ఉంటే ఆ ముగ్గు ఆశ్చర్యంగా తనకేదో చెబుతుంది అనిపించింది, గతాన్ని తుడిచి వెయ్, భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దుకో అంతా నీ చేతిలోనే ఉంది అన్న భావన కలిగింది తనకి.

మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. కాళ్ళు కడుక్కుని కొద్దిగా తీసి ఉన్న తలుపు తోసుకుని ఇంట్లోకి అడుగు పెడుతుండగా వంటింట్లో నుండి బయటకు వస్తున్న అమ్మ "ఏరా!!! రాత్రంతా ఎక్కడికెళ్లావ్??" అని ఆడిగేసరికి, "అదీ అమ్మా !!! అదీ ఉష....ఉష్" అని నసుగుతుంటే "ఉష పెళ్లి చేయడానికి పంతులు గారు కొండ దిగి నిన్ను అక్కడ గుడికి కాపలా పెట్టారా??" అని అనేసరికి అమ్మకి ఇంకేమి చెప్పలేక "అవునమ్మా అదే, అందుకే" అని స్నానం చేయడం కోసం పెరట్లోకి వెళ్ళాడు.

కొంత సేపటికి లోపలికి వస్తుండగా "ఒరేయ్, ఇలా రా" అని అమ్మ పిలవడంతో దగ్గరకి వెళ్ళాడు. హారతి అద్ది కుంకుమబొట్టు పెడుతూ "పుట్టినరోజు శుభాకాంక్షలు రా కన్నా" అని నవ్వుతూ శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమలో విఫలం అనేది తన వ్యక్తిగత సమస్య. పుట్టిన రోజు అనేది ఒక బిడ్డకి జన్మ, కన్న ఆ తల్లికి పునర్జన్మ. అందుకే ఇద్దరూ కలిసి జరుపుకోవలసిన వేడుక అది. నవ్వుతూ ఆ తల్లి కళ్ళల్లోకి చూసాడు, ఆ కళ్ళల్లో ఆనందపుకాంతి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. గత కొద్దిరోజులుగా తను పడుతున్న వేదనకి ఆ ఆనందం ఎంతో స్వాంతననిచ్చి ఇన్నిరోజులు తాను పడుతున్న బాధ కొంతసేపయినా మరిచిపోయేలా చేసింది, ఆ కళ్ళని అలాగే చూస్తూ ఉండిపోయాడు, కొన్ని క్షణాలకి తేరుకుని "కృతఙ్ఞతలు అమ్మా" అని వంగి పాదాభివందనం చేసాడు.

పీట మీద కూర్చోబెట్టి వేడి వేడి పొంగలి, బెల్లం గారెలు, ముద్దపప్ప వడ్డించింది తల్లి. ఒక్కొటొక్కటిగా ఆరగిస్తూ, రుచిని ఆస్వాదిస్తూ కొన్ని క్షణాలు లోకాన్ని మరచిపోయాడు కిరణ్, మధ్యలో గారె తుంచి అమ్మ నోట్లో పెట్టాడు. కంచం అంతా ఖాళీ చేసి "అబ్బా!!! ఏం రుచి అమ్మా, అమృతంలా ఉంది" అని పొగిడేసరికి మురిసిపోతూ "ఎంత కాలానికిరా కంచం ఖాళీ చేసావు" అని దిష్టి తీసి బయటపడేసి వచ్చింది.

ఆరోజు ఇక ఎటూ వెళ్లకుండా ఇంట్లనే గడిపేశాడు కిరణ్, ఎక్కువ సమయం అమ్మకి సహాయపడడం కోసమే కేటాయించాడు. మధ్యాహ్నం కొంత విశ్రాంతి తరువాత మరల అమ్మ పనిలో పడిపోయింది. కిరణ్ ఇంకా లేవలేదు, పొద్దుపోతూ ఉండడంతో "ఒరేయ్!!! సంద్య వేళ అయ్యింది లే" అని గట్టిగా పిలిచింది అమ్మ. మెల్లిగా లేచి కూర్చుని, గట్టిగా ఆవలించి, బద్ధకం విరుచుకున్నాడు కిరణ్. వేడివేడి టీ కాచి కొన్ని పకోడీలు పళ్లెంలో పెట్టుకుని వచ్చి కొడుకుకి అందించింది తల్లి ... "ఎక్కడివమ్మా ఇవి, నువ్వు చేసావా?" అని అడిగాడు "ఇందాక మీ మావయ్య సుబ్బారావు గారు, వారి పాప సంధ్య వచ్చి వెళ్లారు రా ... వారు వస్తే వేడివేడిగా చేసాను" అని చెప్పింది.

వారు వచ్చిన విషయం చెప్పినా ఎందుకు,ఏమిటి అని కూడా అడగలేదు, తన తండ్రి చనిపోయినపుడు చూడడానికి రాలేదని కోపం కిరణ్ కి, అందుకనే పెద్దగా పట్టించుకోలేదు. చొక్కా తొడుక్కుని సంచి పట్టుకుని బజారులోకి వెళ్ళాడు. స్నేహితులని కలిసి, వారితో కొంత సమయం గడిపి సరుకులతో తీరికగా వచ్చాడు. తిరిగి వచ్చేసరికి అమ్మ వాకిట్లో ఎదురు చూడడం గమనించిన కిరణ్ బెరుకుగా "స్నేహితులతో అస్సలు సమయమే తెలియలేదు అమ్మా" అనేసరికి అంతవరకు కొద్దిగా కోపంగా ముఖం పెట్టిన అమ్మ నవ్వుతూ "ఫో, త్వరగా వెళ్లి కాళ్ళు కడుక్కురా, వేడివేడిగా అన్నం వండాను, పప్పుటమాట, అప్పడాలు, ఊర మిరపకాయలు, కమ్మని మీగడ పెరుగుతో అన్నం తిందువుగాని" అనేసరికి హమ్మాయ్య అనుకున్నాడు. తల్లీకొడుకులు భోజనాలు ముగించుకుని రెండు నవారు మంచాలు పెరట్లో వేసుకుని అలా నడుము వాల్చారు...

అమ్మ కిరణ్ ని ఒక మాట అడగాలని సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంది, దానికి ఇదే సమయం అన్నట్లు భావించి అమ్మ గొంతు సవరించుకుని బ్రతిమలాడుతున్నట్లుగా ఉన్న స్వరంతో మాట్లాడుతూ "కిరణ్, యుక్త వయసులో ఉన్న ఆడపిల్లకి ఇంటిపనిలో చేసే చిన్న చిన్న సాయాలతో సమయం గడిచిపోతుంది, వయసుతో పాటే ఇంట్లో పని కూడ పెరిగిపోతుంది, పెళ్లయ్యాక ఇంటి బాధ్యత, ఆ తరువాత పిల్లల బాధ్యత, ఆ పిల్లలు పెరిగి పెద్దయి పెళ్లిళ్లు అయ్యాక వాళ్ళ పిల్లల బాధ్యత, ఇలా ఆడదాని జీవితం పనికే అంకితమా అన్నట్లుగా మారిపోతుంది. ఉమ్మడి కుటుంబాలలో అయితే ఒకరికొకరు సాయం వస్తారు కాబట్టి సరిపోతుంది, కానీ ఇక్కడ నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, నువ్వు ఎంత సాయం చేసినాకూడా ఆడపని ఆడపనే, మగ పని మగ పనే... నా ఆరోగ్యం సహకరించినన్నాళ్లు ఇబ్బంది లేదు, కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కద కన్నా" అనేసరికి "నాకు అర్ధం అవుతుంది అమ్మ, నీకు సాయంగా ఒక మనిషి కావాలని, పని మనిషిని చూడమని అప్పారావు బాబాయి కి చెబుతానులే " అన్నాడు కిరణ్

" ఒరేయ్, పని మనిషి కాదురా, మన మనిషి కావాలి ..... నీకు ఈడు అయిన అమ్మాయిని, నాకు తోడుగా ఉండే అమ్మాయిని చూస్తాను, పెళ్లి చేసుకో నాన్నా " అంది అమ్మ.

"అమ్మా, నేను కూడ ఒక మాట చెబుతాను నువ్వు కూడా సావధానంగా విను. పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత, ఇప్పుడే ఒక ఇబ్బంది నుండి బయట పడ్డాను, నాకు కొంత సమయం ఇవ్వు అమ్మా. ముందు, వెనక ఆలోచించుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి" అని కిరణ్ అనగానే 

"అలాగే కన్నా!!! నీ ఇష్టం,నిన్న మొన్నటి దాకా ఈ విషయం అడిగితే సమాధానమే వచ్చేది కాదు, కనీసం ఇప్పుడు సమయం కావాలి అని అయినా అడిగావు,అవునూ... ఇబ్బంది నుండి బైట పడ్డాను అన్నావ్, ఏం ఇబ్బంది రా??" అని అమ్మ అడిగింది. 

"పడ్డాను కాదమ్మా, పడ్డాం... మనం శెట్టి గారికి ఇవ్వవలసిన అప్పు ఇటీవలే కదా తీర్చాం, దాని గురించి చెబుతున్నాను. అయినా పెళ్లంటే బోలెడు ఖర్చు కదమ్మా ?? మరి మనం ఎంతోకొంత పోగేసుకోవాలి కదా !!!"

"కలిసిరావాలే కానీ డబ్బుదేముంది రా??" అంటూ కిరణ్ వైపు చూసేసరికి అప్పటికే నిద్రలో ఉన్నాడు, లేదు లేదు నటిస్తున్నాడు.
"వీడెప్పుడూ ఇంతే పూర్తిగా వినడు, వాడి నాన్న లాగా" అంటూ తను కూడా నిద్రకి ఉపక్రమించింది.

----------------------------------------------------------------------------------
ఉష,కిరణ్ ఇరువురికి ఎడబాటు వలన బాధ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, ఉష అప్పటికే పెళ్ళయ్యి నెలరోజులు గడిచిపోయింది. కిరణ్ కి కళ్యాణ్ గురించి పూర్తిగా తెలుసు... ఉషని చాలాబాగా చూసుకుంటాడు అందులో అనుమానం లేదు, గతాన్ని మరచిపోయి తన జీవితాన్ని మలచుకోవడం ఇక ఉష చేతిలోనే ఉంది.

తన ఆలోచన వచ్చినపుడల్లా మనసులో కిరణ్ కి చివుక్కుమంటున్నా ఆ భావన నుండి బయటపడడం కోసం ఖాళీ లేకుండా రోజంతా పనులతో హడావుడిగా గడపసాగాడు, అలా ఒక నెలరోజులు గడిచిపోయాయి. అమ్మేమో వివాహం కోసం డబ్బు దాచుకునేందుకేమో వీడు ఇంత హడావుడిగా ఉంటున్నాడు అని ముచ్చట పడిపోసాగింది.
----------------------------------------------------------------------------------

ఎప్పటిలాగే భోజనాలు కానిచ్చి పెరట్లో పక్కపక్కనే చెరో మంచం వేసుకుని పడుకున్నారు ఇద్దరూ, చల్లగా వీస్తున్న ఆ గాలికి అమ్మ మెల్లిగా నిద్రలోకి జారుకుంది. రోజూ అమ్మకన్నా ముందే నిద్రపోయేవాడు కిరణ్, కానీ ఈరోజు ఒక ముఖ్యమయిన నిర్ణయం ఒకటి అమ్మ చెవిలో వేయడంకోసం లేచి ఉన్నాడు, అది ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతుంటే నిద్రలో అమ్మ కాళ్ళు తన్నుకోవడం గమనించాడు, పాపం రోజంతా ఇంటి పని ఎంత కష్టమయినది అయినా నవ్వుతూ చేసుకుపోతున్న తల్లి కష్టం తన కళ్ళముందు కదలాడింది. లేచి తల్లి పాదాల దగ్గర కూర్చుని మెల్లగా వత్తడం ప్రారంభించాడు, చటుక్కున మెలకువ వచ్చింది తల్లికి. " అయ్యో నాన్న, ఏం పని రా ఇది...లే లే లే లే" అంటూ కిరణ్ ని లేపసాగింది. "

"ఏం లేదమ్మా , నిద్రపట్టలేదు...అటు ఇటు దొర్లుతుంటే నువ్వు కాళ్ళు తన్నుకోవడం గమనించాను...నొప్పులేమో అని"

"అవి రోజూ ఉండేవే రా .. తక్కువ వయసా చెప్పు నాది"

"నిజమేలే !!! అందుకే నువ్వు ఆనందించే విషయం ఒకటి చెబుతాను అమ్మా"

"ఏంట్రా కన్నా " అని అడిగింది ఆశ్చర్యంగా అడిగింది తల్లి.

"సంబంధాలు చూడమని నువ్వు పంతులు గారికి చెబుతావా (లేక) నేను చెప్పనా ??"

"అబ్బ, నా తండ్రి ఏం శుభవార్త చెప్పావురా, పగటిపూట అయితే పరిగెత్తుకెళ్లి ఈ విషయం చెప్పేదానిని"అంది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ

"అవునమ్మా!! ఇదే సరయిన సమయం. ఇంక నీపనిలో నువ్వుండు" అన్నాడు.

"సరే నాయనా, చెప్పాల్సింది చెప్పావుగా, ఇంక పడుకో.. నేను రేపు వెళ్లి పంతులుగారితో మాట్లాడి వస్తాను" అని ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు.

----------------------------------------------------------------------------------
ఉదయాన్నే అన్ని పనులూ ముగించుకుని కొండమీద పంతులుగారి వద్దకు వెళ్లి ఫోటోలు, వివరాలు ఇచ్చి వచ్చింది అమ్మ, వెళ్లి వచ్చిన విషయం కొడుకు చెవిన వేసి ఎప్పటిలాగే ఎవరిపనిలో వాళ్ళు పడ్డారు. ఒక నెల రోజుల తరువాత సాక్ష్యాత్ పంతులు గారు కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చారు.

మర్యాదలు అన్నీ పూర్తయ్యాక.. పంతులుగారు మాట్లాడుతూ
" అమ్మా మహాలక్ష్మి, నీ కొడుకు అదృష్ట జాతకుడు తల్లీ. ఈ వివరాలు పట్టుకుని తిరుగగా తిరుగగా ఒక మంచి సంబంధం దొరికింది. అమ్మాయి సాక్ష్యాత్తు లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంది, మంచి కుటుంబం, అస్తీపాస్తీ వివరాలు అవీనూ చెబుతూ పోతే ఈ పూట చాలదు. మీ అబ్బాయి వాళ్ళకి తెగ నచ్చాడు, వీడ్ని చాలా సార్లు ఆ కుటుంబం మార్కెట్ యార్డ్ లో చూశారట, మీరు ఒప్పుకుంటే రేపే పెళ్లిచూపులు" అనగా

"మంచిది పంతులుగారు, రేపే పెళ్ళిచూపులకి వస్తామని చెప్పండి" అంది అమ్మ.

"ఒకేసారి పెళ్ళిచూపులంటే ఎలా అమ్మా!!! పంతులుగారు, ఫోటో ఏమి లేదా, తను ఎలా ఉంటుందో కనీసం తెలియాలి కదా??" అన్నాడు కిరణ్

"సరే అయితే ఫోటో నేను రప్పిస్తాను, నువ్వు ఈరోజు సాయంత్రం ఒకసారి గుడికి రా, శుభస్త్య శీఘ్రo " అని పంతులుగారు బయలుదేరారు.
----------------------------------------------------------------------------------
సాయంత్రం గుడికి వెళ్లిన కిరణ్ తో పంతులుగారు మాట్లాడుతూ
"ఒరేయ్ కిరణ్!! నేను వారిని ఫోటో అడిగాను, ఫోటోలుగిటోలు అంటే కుదరదు, కావాలంటే మీ మీద నమ్మకంతో పిల్లని బైట ఎక్కడో కాకుండా, ఇక్కడ మన సీతారాములవారి గుడిలో కలిసే ఏర్పాటు చేస్తాను అన్నాడురా వాళ్ళ నాన్న, ఏమంటావ్ ??"

"సరే పంతులుగారు, మీరు ఎన్ని గంటలకి రావాలో కబురు పెట్టండి, నేను ఆ సమయానికి ఇక్కడకి వస్తాను" అన్నాడు

"సరే, నేను ఎవరో ఒకరి చేత కబురు పెడతానుగానీ, నీతో ఒక పదినిముషాలు మాట్లాడాలిరా " అన్నారు పంతులు గారు

"చెప్పండి పంతులు గారు"

"నేను అన్నాను అని కాదు గానీ, నీ పాత ప్రేమ విషయం ఆ అమ్మాయితో చర్చించకు, ఆ అమ్మాయితోనే కాదు ఎవరితోకూడా చర్చించకు,అంత మంచిది కాదు, అందరి ఆలోచన ఒకలా ఉండదు... నువ్వు ప్రేమే అంటావు, వాళ్ళు ఇంకేదో ఊహించుకుంటే మొదటికే వస్తుంది తంటా!!! పెళ్లి తరువాత కళ్యాణ్ ఉషని తీసుకుని వెళ్ళిపోయాడు, ఉద్యోగరీత్యా స్థానచలనం సాధారణం కదా వాడికి ... నువ్వు అడిగినా అడగకపోయినా నేను చెప్పాలి, ఎందుకంటే నీ మనసులో ఏదో ఒక మూల తాను ఎలా ఉందో అన్న ఆలోచన వస్తుంది కదా!! అందుకే చెప్పాను. ఇక ఉష లేదు గీష లేదు, కొత్త జీవితం మొదలెట్టు. జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే, కానీ ప్రేమే ఎక్కువ గాయాలు చేస్తుంది, అవి మానాలంటే జీవితకాలం పడుతుంది. ఏదయినా మన మంచికే అనుకో, ఇంటికెళ్లి ఈ రాత్రికి త్వరగా పడుకో, శుభ్రంగా తయారయ్యి రేపు ఉదయం తెల్ల చొక్కా, ముదురు నీలంరంగు ప్యాంటు తొడుక్కుని రా, వెళ్ళిరా నాయనా, జై శ్రీరామ్" అని దీవించి పంపారు

"అలాగే పంతులుగారు!!! మీకు, నాకు, తనకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదులేండి. అయినా ఆవిడ దారి ఆవిడ చూసుకున్నప్పుడు మరి నేను కూడా నా దారి చూసుకోవాలిగా, అందుకే సంబంధం చూడమని చెప్పాను" అన్నాడు కిరణ్, పంతులు గారి నమస్కారం చేసి అక్కడనుండి బయలుదేరాడు.

------------------------------------------------------------------------
మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పంతులుగారు చెప్పినట్లు బట్టలు వేసుకుని బయలుదేరాడు కిరణ్, ఒక్కొక్క మెట్టూ తనలో ఉత్సాహాన్ని పెంచసాగింది ఎందుకంటే ఇవే మెట్లు తనని కొత్త జీవితంలోకి తీసుకెళ్లాయి మరి, తనలో ఒక రకమైన ఆత్రుత మొదలయ్యింది, ఆ ఆత్రుతతో గుండె వేగం పెరగసాగింది ... ఆ అమ్మాయి కోసమే ఆలోచన ... "తను ఎలా ఉండబోతోంది ... తను నాకన్నా పొడుగా,పొట్టా ... నేను నచ్చుతానా, నచ్చనా ... మొదటగా ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి ... పేరు చెప్పనా, అడగనా " ఇలా ఎన్నో వందల ప్రశ్నలు మెదులుతూ ఉండగా కొండపైకి చేరుకున్నాడు. రాములవారి గుడిలోకి వెళ్లి దణ్ణం పెట్టుకుని బొట్టు పెట్టుకుని గుడిలో పక్కగా కూర్చున్నాడు ... పంతులు గారు వచ్చి "లక్షణంగా ఉన్నావు నాయనా, నుదుటిన ఉన్న ఈ కుంకుమ బొట్టే తొందరలో కళ్యాణతిలకంగా మారాలని ఆ సీతారాములవారిని కోరుకుంటున్నాను నాయనా" అనగానే మానసికమయిన బలం చేకూర్చడానికి అన్నట్లు ఎవరో భక్తులు గంట కొట్టారు. 

కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి కొండ మెట్లు ఎక్కుతూ కనపడ్డారు. చిలక ఆకుపచ్చ రంగు చీర, నీలం రంగు జాకెట్ ... కిరణ్ కి పంతులుగారు చెప్పిన గుర్తులు ఇవే, ఒకవేళ తను భక్తులతో గుడిలో రద్దీగా ఉంటే గుర్తుపట్టడం కోసమని. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆ వ్యక్తి పైకి రాసాగింది, మనిషి దగ్గరయ్యేకొద్దీ కిరణ్ కి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంకొద్ది దూరంలో ఉందనగా సీతారాముల వైపు తిరిగి చూస్తూ మనస్సులో నమస్కారం చేసుకున్నాడు. తిరిగి చూసేలోపు తన ఎదురుగా నిలిచి ఉంది తను నవ్వుతూ.

"హేయ్ సంధ్యా... నువ్వు ఇక్కడున్నావ్ ఏంటి??"

"ఏం... నేను గుడికి రాకూడదా బావా ??"

"అయ్యో...రాకూడదు అని నేనెందుకంటాను"

"సీతారాములవారి గుడికి తరచుగా వస్తే మంచి మొగుడు దొరుకుతాడట బావా, అందుకే వచ్చాను."

"నేను కూడా అందుకే వచ్చాను సంధ్యా, మంచి భార్య దొరుకుతుందని"

"మరి దొరికిందా బావా?? "

"లేదు తనకోసమే ఎదురు చూస్తున్నా సంధ్యా!!!"

"ఎదురుగా ఉంటే ఎదురు చూడడం దేనికి బావా" అంది ముసిముసిగా నవ్వుతూ

"పరాచకాలు కాదు సంధ్యా, నిజం!!! ఇక్కడికి పెళ్లి చూపుల కోసం వచ్చాను, ఆమె మరికొద్ది సేపటిలో ఇక్కడికి వస్తుంది, సరిగ్గా నువ్వు వేసుకున్న వస్త్రాల రంగే పంతులుగారు ఆమెకి సూచించారట, బహుశా తనేమో అని ఎంతో ఆశపడ్డాను."

"ఓహో, ఎదురు చూపులు అప్పుడే...సరే బావ నేను అలా పక్కగా నిలబడి చూస్తాను, నీ కాబోయే భార్య ఎలా ఉంటుందో!!!"

"ఇది పెళ్లిచూపులు మాత్రమే సంధ్యా, ముందు ఒకరికొకరం నచ్చాలిగా"

"నచ్చుతావ్ లే బావా, నేను దర్శనం చేసుకుని మండపంలో కూర్చుంటాను, నేను ఇక్కడున్నాను అన్న సంగతి మర్చిపో" అని అక్కడనుండి వెళ్ళిపోయింది. కిరణ్ మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు ఆలోచనలు అదుపు చేసుకుంటూ.

కొంతసేపటి తరువాత పంతులుగారు వచ్చి కిరణ్ భుజం మీద తడుతూ "కిరణ్, ఆమె వచ్చింది అయ్యా!!! గుడి వెనక ఉన్న మామిడి చెట్టు దగ్గర వేచిచూస్తోంది, వెళ్ళు" అనగానే పంతులుగారి పాదాలు స్పృశించి అటుగా వెళ్ళాడు, మామిడి చెట్టు పక్కన అటువైపు తిరిగి నిలబడి ఉన్న ఒక స్త్రీ కనపడింది, దగ్గరకి వెళ్ళిన కిరణ్ "పెళ్ళిచూపులకి వచ్చింది మీరే కదండీ!!" అన్నాడు. "అవును" అన్నట్లుగా తల ఊపింది ఆమె, నా పేరు కిరణ్, మహాలక్ష్మి గారి అబ్బాయిని" అని పరిచయం చేసుకోగానే "తెలుసు" అన్నట్లుగా తల ఊపింది.

"లక్క బొమ్మలా తల భలే ఊపుతున్నారు గానీ, అదేదో ఇటు తిరిగి ఊపితే నేను కూడా చూసి ఆనందిద్దును కదండీ!!!" అనేసరికి చిన్నగా నవ్వి తన చేతిలో ఉన్న గజ్జెతో ప్రతీ ౩ క్షణాలకు ఒకసారి సవ్వడి చేస్తూ మెల్లగా తిరగసాగింది, పూర్తిగా తిరిగేసరికి కళ్ళు మాత్రమే కనపడేలా మొత్తం ముఖం అంతా పలుచటి వస్త్రం ఒకటి కప్పుకుని ఉంది ఆమె.

ఆల్చిప్పల్లాంటి కళ్ళు, తీరయిన కనుబొమ్మలు చూడగానే ఒక మాట కిరణ్ నోటివెంట సున్నితంగా దొర్లింది " తెర వెనుక దాగిన అందం, తెర తీస్తే కలవొచ్చు బంధం" అనగానే "అబ్బా... పంతులుగారు చెప్పింది నిజమే!!! మీరు మంచి మాటకారే" అని పలికింది. "ఆహా, ఇంకేం చెప్పారో పంతులు గారు" అని అడిగాడు

"ఓ, చాలా చాలా చెప్పారు ... అబ్బాయి చాలా మంచోడని, నిజాయితీ గలవాడని, తెలివయిన వాడని, మంచి హాస్యచతురత కలవాడని, కష్టించి పనిచేసే తత్త్వం కలవాడని, గర్వం లేని వాడని, బాధ్యతలు బాగా తెలిసినవాడని, ఇంటా బయటా అన్నీ తానే అయ్యి నడిపిస్తాడని, అమ్మంటే మిక్కిలి గౌరవం, ప్రేమ అని ... అబ్బో అసలు మీ గురించి చెబుతుంటే ఆయన కళ్ళల్లో ఆనందం ... మీకు ప్రతినిధిలా మారిపోయారంటే నమ్మండి. ఈ రాములవారి గుడితో మీ మీకు అనుబంధం గురించి, ఇక్కడ ప్రతీ అణువులోను మీకు జ్ఞాపకాలున్నాయట, ఈ మామిడి చెట్టు అంటే మీకు ప్రాణం అట" అనగానే "అబ్బా, నా గురించి చాలానే చెప్పారు, అయితే ఇక నేను పెద్దగా చెప్పాల్సింది ఏమి లేదన్నమాట!!!"

"అవును, మీకు సంబందించి అవసరమయిన ప్రతీ వివరం ఇచ్చారు, మీరు మంచి ప్రేమికుడని కూడా చెప్పారు"
కిరణ్ కొద్దిగా గొంతు సర్దుకుని "ప్రేమికుడా??"అన్నాడు...అప్పుడు ఆమె "హా... అవును ... మీ ఇంటిని ప్రేమిస్తారట, మీ బడిని ప్రేమిస్తారట, ఈ గుడిని ప్రేమిస్తారట" అని ఇంకేదో మాట్లాడుతుండగా కిరణ్ ఆమె మాటలకి అడ్డుపడుతూ "అవకాశం ఇస్తే మిమ్మల్నీ ప్రేమిస్తాను, జీవితాంతం మహారాణిలా చూసుకుంటాను" అనగానే వాతావారణం కాస్త గంభీరంగా మారింది. అంతవరకూ సరదా, సరదాగా సాగుతున్న సంభాషణ అకస్మాత్తుగా ఆగిపోయింది.

అకస్మాత్తుగా జరిగిన ఊహించని సంఘటన కి ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చొరవ తీసుకుని కొద్దిగా ముందుకెళ్లి కళ్ళలోకి రెప్ప వేయకుండా సూటిగా చూస్తూ " ప్రేమ అనేది మనసుకి సంబంధించింది, మీ మాటలతోనే అర్ధం అవుతుంది మీ మనసు ఎలాంటిదో, అందుకే మీ మనసుని ప్రేమించడం మొదలుపెట్టాను... ఆ పరదా వెనక మీరు ఎలా ఉన్నా సరే... మీకు సమ్మతం అయితే నాకు కూడా సమ్మతమే" అని ఆగాడు. ఆమె మాట్లాడుతూ "నా పేరు కూడా చెప్పలేదు మీకు ఇంకా, మీరేమో ప్రేమిస్తున్నా అంటున్నారు, పంతులుగారు ఊరికినే చెప్పలేదు మీరు ప్రేమికులని" అంది ... "చెప్పా కదండీ ప్రేమకి మనసు చాలని" అన్నాడు. ఇంతలో గట్టిగా వీచిన గాలి తాకిడికి తన ముఖం మీదున్న పరదా తొలగిపోయింది. కొన్ని క్షణాలపాటు కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు.ఆమె అరవిరిసిన నవ్వుతో, సిగ్గు పడుతున్నట్లుగా తల వంచుకుంది, బుగ్గలు ఎర్ర బడ్డాయి. 

"హేయ్ సంధ్యా, నువ్వా?? అని ఆశ్చర్యపోతూ అడిగాడు కిరణ్.
"అవును బావా, పంతులు గారు నీకోసం చూసిన ఆ పెళ్లి కూతురుని నేనే" అంది కిరణ్ మరదలు సంధ్య.
"మరి ఈ దాగుడుమూతలు ఏంటి సంధ్యా".
"మా నాన్న అంటే నీకు కోపం కదా, ఎక్కడ ఆయన పేరు చెబితే నన్ను తిరస్కరిస్తావో అని భయంతో ఇంతవరకూ దాచాను" అంది సంధ్య. 
"కోపతాపాలు ఎక్కువ కాలం ఉంటాయా ఏంటి??? అయినా దానికి కారణం అమ్మ చెప్పింది. మా నాన్న గారు పోయినపుడు మావయ్య చూడడానికి కూడా రాలేదని కోపం ఉన్నమాట వాస్తవం, కానీ ఆ సమయంలో మీ అక్క పెళ్లి కోసం గోదుమరాయి పాతారని, అందుకనే రాలేకపోయారు అని తరువాత తెలిసింది"

"మరి నేనంటే నీకు ఇష్టమేనా బావా??" అని అడిగింది అమాయకంగా, తన చేతిలో ఉన్న గజ్జె తన చేతిలో పెడుతూ. ఇదే చోటులో ఉష తనని ఒంటి గజ్జెతో వదిలివెళ్లడం గుర్తొచ్చింది కిరణ్ కి. 

"మరి ఈ ఒంటి గజ్జె ఏంటి సంధ్యా " అని కిరణ్ అనడంతో "బావా, నీ పుట్టినరోజునాడు నీకు అభినందనలు చెప్పడానికి వచ్చాను, నువ్వు ఎంతకీ నిద్ర లేవకపోవడంతో ఇల్లంతా కలియదిరిగాను, గోడ మీద శీలకి ఈ గజ్జె ఒంటిగా వేళ్ళాడడం చూసాను, అత్తయ్యని అడిగితే చాలా ముఖ్యమయిన వారు కొని ఇచ్చారు, ఒకటి ఎక్క పడిపోయింది, కనీసం ఇదయినా నాతో జీవితాంతం ఉండాలి అన్నావట, ఆ ఒంటి గజ్జె నువ్వే అని ఆ క్షణాన అనిపించింది, దానిని జంట చేసే ఉద్దేశంతో నా మనసులో మాట అత్తయ్యకి చెప్పాను, నీకు సమ్మతమేనా బావా ???"" అని జాలిగా ముఖం పెట్టడంతో రెండు చేతులు చాపి దగ్గరకి తీసుకుని అభిమానంగా కౌగిలించుకుని " గజ్జెలు జంటగానే బాగుంటాయి, నాకు కూడా సమ్మతమే" అన్నాడు. 

"ఒరేయ్, ఇది పెళ్ళిచూపులేరా ... పైగా ఇది గుడి అన్న సంగతి మర్చిపోయావ్ రా వెధవాయ్" అని పంతులు గారు అంటుండగా ఆయనవైపు చూసాడు. పంతులు గారికి కుడివైవు అమ్మ, ఎడమవైపు మావయ్య నవ్వుతూ నిలబడి ఉన్నారు.

ఆశ్చర్యంగా పంతులుగారివైవు చూస్తున్న కిరణ్ కి సమాధానం చెబుతూ "ఒరేయ్, నీ పుట్టినరోజు నాడు మీ మావయ్య, మరదలు నన్ను కలవడం జరిగింది, ఆ సాయంత్రమే మీ అమ్మని కూడా కలిసారు. ఎలా అయినా ఈ సంబంధం కలిసేలా చూడమని ఒకటే పోరు, జాతకాలు కూడా బాగా కలిసాయి రా, అయినా మనసులు కలవడం ముఖ్యం కానీ జాతకాలది ఏముంది గానీ. ఇంతకీ మీ ఇద్దరికీ సబబేనా?? అని అడగగా ....
కిరణ్ నవ్వుతూ అవును అన్నట్లు తలూపాడు, సంధ్య నవ్వుతూ "వారు ఏం చెబితే అదే" అని, వెళ్లి కాబోయే అత్తయ్య భుజం మీద వాలి సిగ్గు దాచుకుంది,

ఇక మనతో వీళ్ళకి పని లేదు పంతులుగారు, పదండి పోదాం దగ్గరలో ముహూర్తాలు చూడాలి మీరే, పద చెల్లెమ్మ, వాళ్లిద్దరూ మరికొంతసేపు మాట్లాడుకుని వస్తారులే ... అంటూ అక్కడనుండి వెనుదిరిగారు మావయ్య. 

********శుభం********

మనం కోరుకున్న వ్యక్తి దూరం అయితే కలిగే బాధ వర్ణించలేనిది, మనల్ని కోరుకునే వ్యక్తి జీవితభాగస్వామి లభిస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది, అది ఎవరికీ వారికి స్వీయ అనుభవం ద్వారానే తెలుస్తుంది. నైరాశ్యంలో కూరుకుపోకుండా ఆశావాహదృక్పదంతో చేయవలసింది చేసుకుంటూపోతే జీవితం మనకి ఇవ్వవలసిన ఫలాలను తప్పక ఇస్తుంది. ప్రేయసి ఎడబాటుతో "ఉష లేని కిరణం" గా మారిన వ్యక్తి ఆటుపోట్లు తట్టుకుని నిలబడి, కుటుంబం రూపంలో అందిన మద్దతుతో "సంధ్యాకిరణం" గా మారాడు. పోయిన చోటులోనే వెతుక్కోమంటారు, ఓడిన చోటే గెలవమంటారు పెద్దలు. కిరణ్ ఓడిన చోటే గెలిచాడు, పోయిన చోట వెతుక్కోకుండానే వివాహబంధం రూపంలో పెద్ద బహుమతి దొరికింది. 


 ఉషలేని కిరణం   పై క్లిక్ చేసి మొదటి భాగాన్ని చేరుకోండి 

మీ,
సుద్దపల్లి వెంకట సాయి కిరణ్



x

Comments